ధనికుల జాబితాలో జగన్
న్యూఢిల్లీ : ఆశ్చర్యం ... ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి పేరు ఆ జాబితాలో మాయమైపోయింది. జగన్ పేరు ప్రత్యక్షమైంది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పేరే అది. ఆదాయం పన్ను చెల్లింపులో అకస్మాత్తుగా జగన్ అందరికంటే ముందుకు వచ్చేశారు. అడ్వాన్స్ పన్ను చెల్లింపుల ఆధారంగా రూపొందించిన అగ్ర శ్రేణి పన్ను చెల్లింపుదారుల జాబితా ఈ దఫా ఎంత మందినో ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. ఆ జాబితాలో అగ్రస్థానం లలిత్ మోడికి దక్కింది.
గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి కేవలం 2.92 లక్షల రూపాయలు పన్ను చెల్లించిన జగన్, ఈ సంవత్సరం తొలి ఆరు మాసాలకే ఏకంగా 6.6 కోట్ల రూపాయల పన్నును అడ్వాన్స్ గా చెల్లించారు. అంటే ఆయన వ్యక్తిగత ఆదాయం 2009-10 సంవత్సరంలో 70 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉందని అంచనా. అంటే కనీసం 22 కోట్ల రూపాయల మేరకు పన్ను చెల్లించనున్నారన్న మాట.
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న జగన్ గత సంవత్సరం ప్రథమార్ధంలో అసలు పన్నేమీ చెల్లించలేదు. కాని ఈ సంవత్సరం ప్రథమార్ధంలో 6.6 కోట్లు రూపాయల అడ్వాన్సు పన్ను చెల్లించారు. టాప్100 పన్ను చెల్లింపుదారులలో జగన్ ఒక్కరే ప్రముఖ రాజకీయ నాయకుడని అభిజ్ఞ వర్గాలు పేర్కొన్నాయి. జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే క్రికెటర్లు మాత్రమే క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ ఆదాయాన్ని సూచించారు. ధోని, సచిన్ క్రితం సంవత్సరం ప్రథమార్ధంలో వరుసగా రూ. 1.8 కోట్లు, రూ. కోటి చెల్లించారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలలకు ధోని చెల్లించిన మొత్తం రూ. 2 కోట్లు కాగా, సచిన్ టెండూల్కర్ కోటిన్నర రూపాయలు చెల్లించారు.
Pages: 1 -2- -3- News Posted: 31 October, 2009
|