ఇం'ధన'మ్ కంపెనీల ఇష్టం
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని, భేదాత్మక ధరల విధానాన్ని ప్రవేశపెట్టాలని, డీజెల్ ధరను లీటర్ కు ఒక రూపాయి పెంచాలని పెట్రోలియం మంత్రిత్వశాఖ గట్టిగా కోరబోతున్నది. కేంద్ర మంత్రివర్గం గురువారం సమావేశమైనప్పుడు ఈ మంత్రిత్వశాఖ ఈ మేరకు ప్రతిపాదన చేయబోతున్నది. మంత్రివర్గం ఆమోదముద్ర లభించినట్లయితే, ప్రభుత్వ నియంత్రణ తప్పించాలన్న ప్రతిపాదన వల్ల పెట్రోల్ లీటర్ ధర రూ. 4.71 మేరకు పెరగవచ్చు. దేశంలోని పెట్రోల్ బంకుల ధరలు, అంతర్జాతీయ ధర మధ్య వ్యత్యాసం లేదా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు, ప్రభుత్వం పంచుకుంటున్న నష్టాల పరిమాణం ఇది.
కాంగ్రెస్ కోర్ కమిటీ బుధవారం ఈ అంశాన్ని పరిశీలించనున్నది. ధరల హెచ్చింపు అవసరాన్ని గుర్తించిన పార్టీ అధిష్ఠాన వర్గం ఈ భారాన్ని ప్రభుత్వం కొంత తగ్గిస్తే బాగుంటుందని భావిస్తున్నది. 'ఆజమ్ గఢ్ లో తన పంపు సెట్ కు ఇంధనం కోసం ఒక రైతు చెల్లించే ధరనే డీజెల్ మెర్సిడిస్ కారు యజమాని చెల్లిస్తున్న వైపరీత్యాన్ని' తొలగించేందుకు పెట్రోలియం మంత్రిత్వశాఖ ముందుగా గట్టి ప్రయత్నం చేస్తుంది.
ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చినట్లయితే, కీరిత్ పారీఖ్ బృందం నివేదికను అమలు జరిపినట్లు కాగలదు. మోటారు వాహనాల ఇంధనాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించాలని, వంట గ్యాస్ ధరను సిలిండర్ కు రూ. 100 మేర, కిరోసిన్ ధరను లీటర్ కు రూ. 6 మేర హెచ్చించాలని ఈ బృందం క్రితం బుధవారం (3న) సిఫార్సు చేసింది. అంతే కాకుండా, మార్కెట్ ధరతో సారూప్యం తీసుకువచ్చేందుకై వాణిజ్యేతర డీజెల్ వాహనాలపై రూ. 80 వేల మేరకు భారీగా పన్ను విధించాలని కూడా ఈ కమిటి తన నివేదికలో సూచించింది. ఈ వాహనాలకు ఇంధన సబ్సిడీ అనుచితమని కమిటీ భావించింది.
Pages: 1 -2- -3- News Posted: 10 February, 2010
|