న్యూఢిల్లీ : కేవలం 20 వేల రూపాయలు. ఇదేమీ పెద్ద మొత్తం కాదని మీరనవచ్చు. కాని ఈ మొత్తంతో 41 సంవత్సరాల ఆసామీ ఒకరు 'భార్య'ను కొన్నారు. 'వధువు' వయస్సు కేవలం 17 సంవత్సరాలు. ఝార్ఖండ్ రాంచి జిల్లాలో ఒక కుగ్రామానికి చెందిన సునీత గత రెండు నెలలుగా ఢిల్లీలో దుర్భర స్థితిలో నివసిస్తున్నది. తాను ఒకరికి భార్యనా లేక కట్టు బానిసనా అనేది కూడా ఆమెకు తెలియదు.
రీటా అనే మహిళ 2008 డిసెంబర్ లో జాతీయ రాజధానికి తీసుకువచ్చిన బాలికల బృందంలో సునీత ఒకర్తె. రూ. 2000 నెలసరి జీతానికి గృహసేవికలుగా ఉద్యోగాలు ఇప్పించగలనని రీటా వారికి వాగ్దానం చేసింది. ఇద్దరి పోషణకు సరిపోయేంతగా తన తల్లి రామవతి ఆర్జించడం లేదున కనుక రీటాతో కలసి ఢిల్లీ రావడానికి సునీత అంగీకరించింది. ఆమె తండ్రి చాలా కాలం క్రితమే మరణించాడు.
ఢిల్లీలో సునీతను గోకుల్ పురిలోని ఒక 'ప్లేస్ మెంట్ ఏజెన్సీ' (ఉద్యోగాలు ఇప్పించే సంస్థ)కు అప్పగించారు. త్వరలోనే ఒక ఉద్యోగం చూడగలమని ఆమెకు వారు హామీ ఇచ్చారు. రూ. 5000 నెలసరి జీతానికి విజయ్ సింగ్ అనే వ్యక్తి తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు సునీతతో జనవరిలో చెప్పారు. సునీత వెంటనే ఈ ప్రతిపాదనకు అంగీకరించింది.