బెలూన్ లో పెళ్ళి!
లక్నో : గాలిలో ప్రేమ గురించి అంతా విన్నాం. కాని గురువారం చోటుచేసుకున్న ఈ కార్యక్రమం మాత్రం భిన్నమైనది. ఇది ఒక 'విలక్షణ వివాహం'. అందునా భూమికి 70 అడుగుల ఎత్తులో జరిగింది. వధూవరులు ఆ ఎత్తులో వివాహం చేసుకున్నారు. మామూలు వివాహ ప్రక్రియలకు భిన్నంగా ఏదైనా చేయాలనే తపనే దేవ్ ప్రశాంత్ ను, అతని వధువు అర్చనను తమ వివాహానికి ఒక ప్రత్యేకతను సంతరింప చేయడానికి హాట్-ఎయిర్ బెలూన్ లో ఎగిరేట్లు చేసింది. వారిద్దరు ఆ బెలూన్ లో ఎగురుతూనే వివాహం చేసుకున్నారు. లక్నో నగరంలో ఇలా జరగడం ఇదే ప్రథమం.
ఒక ప్రభుత్వ అధికారి కుమారుడైన దేవ్ ప్రశాంత్ ఐసిఐసిఐ బ్యాంకులో పనిచేస్తుంటాడు. అర్చన ఇటా నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది. ఈ సాహసోపేత వివాహానికి దేవ్ తొలుత ప్రతిపాదించినప్పుడు తాను ఏవిధంగా స్పందించిందీ అర్చన విలేఖరులకు తెలియజేసింది. 'నీకేమైనా మతిపోయిందా...? పిల్ల చేష్ఠ అనుకున్నావా?' అని అర్చన అతనితో అన్నది. అయితే, 'ప్రేమలో ఏదైనా కాదనరు' అనే పెద్దల సూక్తి ప్రకారం, ఆమె దేవ్ ప్రతిపాదనను తోసిపుచ్చలేకపోయింది. 'అయినప్పటికీ ఇలా గగనతలంలో వివాహానికి అంగీకారం తెలపడానికి కొంత వ్యవధి తీసుకున్నాను' అని వధువు గగన విహారానికి సిద్ధమవుతూ మందహాసంతో చెప్పింది.
అయితే, ఈ కార్యక్రమంలో కూడా కొంత సస్పెన్స్ లేకపోలేదు. హాట్ ఎయిర్ బెలూన్ లో ఒక చోట కంత కనిపించడం అసలుకే ఎసరు వస్తుందా అనే అనుమానాన్ని రేకెత్తించింది. కాని యుద్ధ ప్రాతిపదికను ఆ లోపాన్ని సరి చేసి గగన విహారానికి సంసిద్ధం చేశారు.
గాలిని నింపిన తరువాత ఆ భారీ బెలూన్ లక్నోలోని రామ లీలా మైదానంలో పావు వంతును ఆక్రమించుకుంది. అది క్రమంగా గాలిలో తేలియాడసాగింది. అయితే, గాలులు బలంగా వీస్తూ సమతూకాన్ని దెబ్బ తీస్తుండడంతో బెలూన్ ను బ్యాలెన్స్ చేయడానికి నిర్వాహకులకు దాదాపు పావు గంట పట్టింది.
Pages: 1 -2- News Posted: 27 February, 2009
|