టాయిలెట్ ఉంటేనే పెళ్ళి!
పానిపట్ (హర్యానా): గ్రామీణ హర్యానాలో వధువు కోసం చూస్తున్నారా? మీ ఇంటిలో టాయిలెట్ కనుక ఉంటే మీ పని తేలిక అయినట్లే. ఆశ్చర్యపోతున్నారా? వద్దు. హర్యానాలో మహిళలు ఒక విలక్షణ సమరం సాగిస్తున్నారు. గ్రామీణులలో ఆరోగ్య శుభ్రత గురించి చైతన్యం కలిగించడానికై వారు కాబోయే వరులకు ఒక తేలిక షరతు విధిస్తున్నారు. తమ ఇళ్ళలో టాయిలెట్లు ఉన్నమగవారిని మాత్రమే తమ కుమార్తెలు వివాహం చేసుకుంటారని వారు స్పష్టం చేస్తున్నారు.
న్యూఢిల్లీకి దాదాపు 100 కిలో మీటర్ల దూరంలో పానిపట్ సమీపంలోని శహర్ మల్పూర్ గ్రామ వాసి అయిన 52 సంవత్సరాల సురేష్ దేవికి ఆరుబయట మలమూత్ర విసర్జన చేయడం తప్ప గత్యంతరం లేదు. ఎందుకంటే వారి ఇంటిలో టాయిలెట్ లేదు. కాని తమ కుమార్తెకు వివాహం చేసినప్పుడు వరుని ఇంటిలో టాయిలెట్ ఉన్నదనే విషయాన్ని రూఢి పరచుకున్నారు. 'నా అత్తమామలకు ఇంటిలో టాయిలెట్ లేదు. మా పుట్టింటిలో కూడా ఇదే పరిస్థితి. మేము పొలాలలోకి వెళుతుండేవారం. కాని నిరుడు అన్ని ఇళ్ళలో టాయిలెట్లు ఉండేలా గ్రామ పంచాయతీ చర్యలు తీసుకుంది' అని ఆమె తెలియజేసింది.
' నా చిన్న కుమార్తె సోనియాకు వివాహం చేసినప్పుడు ఆమె అత్తగారింట్లో టాయిలెట్ ఉందనే విషయాన్ని రూఢి చేసుకున్నాను. మేము పేదలం కావచ్చు. కాని వ్యక్తిగత శుభ్రత విషయంలో రాజీ పడలేం కదా' అని సురేష్ దేవి అన్నారు. 66.5 కోట్ల మంది ఆరు బయటే మలమూత్ర విసర్జన చేస్తున్నందున ప్రబలే డయేరియా, టైఫాయిడ్, జాండిస్, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు తాండవించే భారత దేశంలో రాష్ట్ర ప్రభుత్వ పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమం చేపట్టడం ఉపశమనం కలిగిస్తున్నది.
Pages: 1 -2- News Posted: 14 March, 2009
|