ప్రేమ జంటకు మరణశిక్ష!
చండీఘఢ్: ఒకే కులానికి చెందిన ఒక యువ ప్రేమ జంట ఇల్లు విడిచి పారిపోయినందుకు వారికి హర్యానాలో 'ఖాప్' పంచాయతీ (కుల ఆధారిత గ్రామ పంచాయతీ) మరణశిక్ష విధించింది. పారిపోయిన యువతీ యువకులు సోనియా, వేద్ పాల్ జాట్ కుల నిబంధనల ప్రకారం బంధువులు అవుతారని, ఒకే కులంలో వివాహం చేసుకోరాదనే తరతరాల సంప్రదాయాన్ని వారు ఉల్లంఘించారని జింద్ జిల్లా బనావాలాలో జరిగిన కుల పంచాయతీ తీర్పు వెలువరించినట్లు అఖిల భారతీయ ఆదర్శ్ జాట్ మహాసభ అధ్యక్షుడు పరమ్ జిత్ బనావాలా తెలియజేశారు.
తమ కుటుంబాలకు, సమాజానికి అపప్రథ తీసుకువచ్చినందుకు ఆ జంటను వెతికి పట్టుకుని వధించాలని పంచాయతీ ఆదేశించింది. గురువారం రాత్రి గ్రామంలో జరిగిన పంచాయతీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జింద్ జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆ యువతీ యువకులు గ్రామం నుంచి పారిపోయి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తమపై కుల పంచాయతీ ఇచ్చిన తీర్పునకు వారు ప్రాణభయంతో వణకిపోతున్నారు. తమ వివాహానికి తమ కుటుంబాలు ఒప్పుకోవని గ్రహించిన తరువాత వారు ఈ నెల 10న ఇళ్ళు వదలి పారిపోయారు.
Pages: 1 -2- News Posted: 21 March, 2009
|