కూలీ కుర్రాడు టాపర్
హైదరాబాద్ : క్రితం సంవత్సరం నవంబర్ నెలలో 15 ఏళ్ళ యెలవర్తి శివకుమార్ గుంటూరులో ఒక పత్తి మిల్లులో ట్రక్కులలోకి పత్తి బేళ్ళను ఎక్కిస్తూ రోజుకు రూ. 50 ఆర్జిస్తున్నాడు. (అప్పటికి అతను మధ్యలో స్కూలు మానేసిన విద్యార్థి.) ఆ తరువాత అతనిని అదృష్టం వరించింది. శివకుమార్ బుధవారం పదవ తరగతి బోర్డు పరీక్ష పాసైనట్లుగా తన రాష్ట్ర సీనియర్ సెకండరీ సర్టిఫికెట్ (ఎస్ఎస్ సి), మార్కుల జాబితా అందుకున్నాడు. అతనికి 87.5 శాతం మార్కులు లభించాయి. గుంటూరు జిల్లాలో అతనిదే అగ్రస్థానం.
కుమార్ ఇంకా పెద్ద కలలే కంటున్నాడు. ఒక హైస్కూల్ లో తన చదువు కొనసాగించాలని, ఆతరువాత చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని అతని ఆకాంక్ష. అయితే, సరిగ్గా ఆరు నెలల క్రితం అతను పీడకల వంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. జిల్లా ఫ్యాక్టరీల ఇన్ స్పెక్టర్ 40 సంవత్సరాల ఎం.వి. శివకుమార్ రెడ్డి ఎప్పటి వలె ఫ్యాక్టరీల తనిఖీ కార్యక్రమంలో భాగంగా 2008 నవంబర్ 2న ఒక పత్తి మిల్లుకు వెళ్ళినప్పుడు స్కూలు యూనిఫామ్ తో బేళ్ళను ట్రక్కులోకి ఎక్కిస్తున్న కుమార్ కనిపించాడు. ఆయన ఆ బాలుని పిలిపించి స్కూల్ యూనిఫామ్ తో ఫ్యాక్టరీలో ఏమి చేస్తున్నావని అడిగారు.
కుమార్ కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ తన గాథ వినిపించాడు. చదువుకోవాలనేది తన ఆకాంక్ష అని, కాని స్థానిక జిల్లా పరిషత్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ పాఠశాల నెల నెలా వసూలు చేసే రూ. 50 ఫీజు కూడా కట్టలేనంత నిరుపేద కుటుంబం తనదని అతను చెప్పాడు. తన తల్లి అనారోగ్యంతో మంచం పట్టిందని, ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్ గా పని చేసే తన తండ్రి తనకు వచ్చే కొద్దిపాటి జీతాన్ని ఆల్కహాల్ పైనే వెచ్చిస్తుంటాడని అతను తెలియజేశాడు. తన అన్న మూడు సంవత్సరాల క్రితం ఇల్లు వదలి వెళ్ళి ఇంతవరకు తిరిగిరాలేదని, అందువల్ల తన కుటుంబం పోషణకు గాను తాను గత సంవత్సరం మార్చిలో తొమ్మిదవ తరగతి పాసైన తరువాత స్కూలు మానివేశానని కుమార్ చెప్పాడు.
శివకుమార్ రెడ్డి అతనికి రూ. 100 ఇచ్చి వెంటనే ఫ్యాక్టరీలో నుంచి వెళ్ళిపోవలసిందని ఆదేశించారు. కాని, కుమార్ తన తండ్రితో కలసి మరునాడు ఆయన ఇంటికి వెళ్ళాడు. 'తన చదువును కొనసాగించేందుకు అతను నా సాయం కోరాడు. అతని కళ్ళలో ఆ తపన, ఉత్సాహం నాకు కనిపించాయి. అందువల్ల అతనికి దుస్తులు, పుస్తకాలు సమకూర్చి, పదవ తరగతిలో అతనిని చేర్చుకొనేట్లుగా స్కూల్ అధికారులను ఒప్పించాను' అని శివకుమార్ రెడ్డి తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 30 May, 2009
|