డాక్టర్లే రోగులైతే... హైదరాబాద్ : ఏ డాక్టరైనా కాస్త నలతగా ఉన్నట్లుగా కనిపించినప్పుడు ఆయనను 'ఏమైంది డాక్టర్' అని అడిగి చూడండి. బలవంతంగా నవ్వు తెచ్చుకుని ఊరుకుంటారు. ఎందుకంటే వైద్యులు తమకు తాము చికిత్స చేసుకోవడం మాట అటుంచితే తమ ఆరోగ్యం విషయంలో అలక్ష్యం వహించే వైద్యులే అధికంగా ఉంటారు. సకాలంలో మందులు వేసుకోవడంలో గాని, తమను వేధిస్తున్న రుగ్మతలకు సరైన పరీక్షలు చేయించుకోవడంలో గాని వైద్యులే నిర్లక్ష్యపు రోగులుగా ఉంటారని వారు అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని వైద్యులూ ఈ కోవలోకే వస్తారు.
'డాక్టర్లలో రెండు రకాలు ఉన్నారు. తమ ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసేవారు మొదటి రకం. రుగ్మత ఎటువంటిదైనా సరే అది చాలా స్వల్ప రుగ్మతేనని వారు కొట్టిపారేస్తారు. ఇక రెండవ కోవలోకి వచ్చేవారికి అన్నీ అనుమానాలే. వారు మరీ అతిగా వ్యవహరిస్తుంటారు. సాధారణ జలుబుకైనా సరే వారు తమకేమీ తీవ్ర అనారోగ్యం లేదని నిర్థారించుకునేందుకు రకరకాల పరీక్షలు చేయించుకుంటారు' అని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ గాస్ట్రో ఎంటరాలజీకి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ మనూ టాండన్ వివరించారు.
కిమ్స్ లో ఆంకాలజిస్ట్ గా ఉన్న డాక్టర్ పి. రఘురామ్ దాదాపుగా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. 'సాధారణంగా డాక్టర్లు తమ అనారోగ్యాన్ని పట్టించుకోరు. వారు ఎక్కువ గంటలు పని చేస్తుంటారు కనుక ఒత్తిడికి తప్పనిసరిగా లోనవుతుంటారు. ఇది పొరపాట్లకు దారి తీసే అవకాశం ఉంది' అని ఆయన అన్నారు.
సరైన పని గంటలు లేకపోవడం, నిద్ర లేమి, సరైన వేళకు భోజనం చేయకపోవడం వంటి వృత్తిపరమైన సమస్యలు అనారోగ్యానికి దారి తీస్తుంటాయి. నగరంలోని అనేక మంది డాక్టర్లు అధిక రక్తపోటు నుంచి అజీర్తి, విపరీతమైన అలసట వరకు రకరకాల రుగ్మతలతో బాధ పడుతుంటారు. 'నిశ్చేతన జీవన సరళి వల్ల కూడా స్థూలకాయం, సంబంధింత సమస్యలు తలెత్తుతుంటాయి' అని డాక్టర్ టాండన్ పేర్కొన్నారు. 'అయితే కొంతలో కొంత మేలు ఏమిటంటే ఇప్పటి రోజులలో అధిక సంఖ్యాకులైన డాక్టర్లు ధూమపానం చేయడం లేదు. అయితే, ఆల్కహాల్ ఇప్పటికీ కొందరి విషయంలో సమస్యాత్మకంగానే ఉంటున్నది' అని ఆయన చెప్పారు.
Pages: 1 -2- News Posted: 10 September, 2009
|