తాతతో వస్తే డిస్కౌంట్! న్యూఢిల్లీ : ఈసారి మీరు బయట ఏదో హోటల్ లో తినాలనుకునేటట్లయితే, మీ తాతగార్లు, నాయనమ్మ, అమ్మమ్మలను వెంట తీసుకువెళ్ళండి. కుటుంబ సభ్యులంతా సరదాగా గడపడమే కాకుండా కొన్ని రాయితీలు కూడా లభించవచ్చు. ఆతిథేయ పరిశ్రమకు సంబంధించిన అత్యున్నత సంస్థ భారత హోటళ్లు, రెస్టారెంట్ల సమాఖ్య (ఎఫ్ హెచ్ఆర్ఐ) సీనియర్ సిటిజెన్లతో కలసి వచ్చే కస్టమర్లకు డిస్కౌంట్ సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నది.
'మిగిలినవారంతా బయట హోటళ్లలో భుజిస్తుంటే వృద్ధులను సాధారణంగా ఇళ్ళలోనే ఉంచుతుంటారు కదా. అలా కాకుండా వృద్ధులను కూడా తమతో తీసుకువచ్చేలా కుటుంబాలను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం' అని సమాఖ్య ప్రధాన కార్యదర్శి దీపక్ శర్మ తెలియజేశారు. 'మేము ముందుగా మెట్రో నగరాలలో ప్రయోగాత్మకంగా దీనిని అమలు జరపాలని అనుకుంటున్నాం. ఆతరువాత దీనిని చిన్న నగరాలకు విస్తరిస్తాం' అని ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదనపై చర్చించవలసిందిగా సమాఖ్య రాష్ట్ర శాఖలను కోరినట్లు, డిస్కౌంట్ శాతంతో సహా తుది నిర్ణయాన్ని ఆయా రెస్టారెంట్లకే వదలనున్నట్లు శర్మ చెప్పారు.
ఆర్థిక స్తోమత గల వృద్ధుల జనాభా ఎక్కువగానే ఉన్న చండీగఢ్ నగరంలో కొన్ని హోటళ్లు ఇదివరకే ఈ పథకాన్ని ప్రారంభించాయి. అవి 15 శాతం నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. వృద్ధులు మాత్రమే వచ్చినప్పటికీ వారు డిస్కౌంట్ కు అర్హులవుతారు. కాని ఒక బృందంలో సభ్యులుగా వారు వచ్చినట్లయితే, డిస్కౌంట్ మొత్తం బిల్లుకు వర్తిస్తుంది. వయస్సు నిర్థారణకు ఎటువంటి పత్రాలను తీసుకురానవసరం ఉండదు. ఈ పథకాన్ని జయప్రదంగా అమలు పరచడానికై ఎక్కువ శాకాహార పదార్థాలను, చక్కెర వ్యాధి నిరోధక ఆహార పదార్థాలను ఆఫర్ చేస్తూ మెనూలను మార్చాలని కూడా పరిశ్రమ యోచిస్తున్నది.
పాశ్చాత్య దేశాలలో ఇటువంటి డిస్కౌంట్లు సర్వసాధారణం. వృద్ధుల సంక్షేమం కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలు (ఎన్ జిఒలు) ఇండియాలో కూడా ఇటువంటి రాయితీలు ప్రవేశపెట్టాలని సూచించాయి.
'కొన్ని కుటుంబాలలో వృద్ధులకు ఆదరణ కొంత తక్కువగానే ఉంటుంది. వారు తమ పిల్లలతో కలసి నివసిస్తున్నప్పటికీ వారిని ఇతర కుటుంబ సభ్యులు తమతో పాటు బయటకు తీసుకువెళ్ళడం అరుదు' అని 'వుయ్ కేర్' సంస్థకు చెందిన ఉమా గణపతి పేర్కొన్నారు. 'హోటళ్లవారు ఇటువంటి ప్రతిపాదనతో ముందుకు వస్తే లంచ్ కు లేదా డిన్నర్ కు తమ తాత నాయనమ్మలను తమ వెంట తీసుకువెళ్ళడానికి యువతరాన్ని ప్రోత్సహించినట్లు కాగలదు. ఇది హోటల్ పరిశ్రమకు మరింత వ్యాపారాన్ని కూడా తీసుకురాగలదు' అని ఆమె అభిప్రాయం వెలిబుచ్చారు.
Pages: 1 -2- News Posted: 26 September, 2009
|