ఐటీ జంటల కొట్లాటలు హైదరాబాద్ : ఉద్యోగం అంటే... అదే! జీవితం అంటే - ఇదే! భూమ్మీద ఇంతకు మించిన ఉద్యోగం... జీవితం కంచు కాగడా పెట్టి వెతికినా లేనేలేవు. పెళ్ళి సంబంధాలు కుదరాలన్నా... అబ్బాయి ఐటీ యేనా అని మరీ అడిగి పిల్లనిచ్చేవారు. వేతనానికి వేతనం, త్వరగా ప్రమోషన్లు, వారానికి రెండు రోజుల సెలవులు, అడక్కుండానే బ్యాంక్ ల ఋణాలు, విందులు... వినోదాలు... ప్లాస్టిక్ కార్డులపై కొనుగోళ్ళతో ఐటీ ఉద్యోగులు ఏడాది క్రితం వరకూ దర్జాగా జీవించారు. కానీ... 'డాలర్ కాటు'కు సీన్ మారింది. సంస్థలు బతిమలాడి పని చేయించుకోవడం... ప్రోత్సాహాలు ఇవ్వడం... కంపెనీ కార్లలో ఇంటి దగ్గర దిగబెట్టడం... ఇంకా మీ కోరికలేమిటని ఉద్యోగులను అడగటం ఇప్పుడు మచ్చుకైనా లేదు!
అమెరికాతో మొదలైన ఆర్థిక మాంద్యం సెగ... భారత్ ను... ముఖ్యంగా ఐటీ కంపెనీలను తాకింది. కొత్త ప్రాజెక్టుల సంగతి దేముడెరుగు... ఉన్న ప్రాజెక్టులతో బండిని లాగిస్తే చాలు అనే పరిస్థితి కంపెనీలకు వచ్చింది. ప్రమోషన్ సరే... ఉన్న ఉద్యోగాలు ఊడకుంటే అదే పదివేలు - అన్న ధోరణి ఉద్యోగులకు వచ్చింది. అయినా అనేక కంపెనీల్లో ఉద్యోగాల కొత పడింది. ఫలితంగా అప్పులు చేసి ఇళ్ళు, స్థలాలు, కారులు కొన్న ఐటీ ఉద్యోగులకు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందు ఫోన్లు కొట్టి మరీ ఋణాలు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు బాకీ కట్టండని దబాయించాయి. మారిన పరిస్థితులను జీర్ణించుకోలేని కొందరు ఐటీ ఉద్యోగులు, జంటలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
Pages: 1 -2- News Posted: 26 October, 2009
|