ఈజీగానే క్రేజీ 'పిల్' న్యూఢిల్లీ : మందుల దుకాణంలో మామూలుగా అడిగి కొనేసుకోవచ్చు. వైద్యులను బంగాళాఖాతంలో పడేసి ఇష్టానుసారం వాటిని మింగేయవచ్చు. అదేదో పూటుగా తాగేస్తే పట్టేసే తల దిమ్మును వదిలించుకోడానికో, తలనొప్పిని తగ్గించుకోడానికో వేసుకునే గోలీ కాదు. అయినా వాటిని యధేచ్ఛగా అమ్ముకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది.. భావి భారత పౌరునిగా పుట్టవలసిన శిశువుకు ఈ పుణ్యభూమిలో గర్భంలోనే అంతిమగీతం ఆలాపించవచ్చు. ఒక్క మాత్రతో వైకుంఠయాత్రకు పంపేయవచ్చు. అదే అత్యవసర గర్భనిరోధక మాత్ర. ఐ-పిల్, అన్ వాంటెడ్-72 పేర్లతో పెద్దపెద్ద ఔషధ కంపెనీలు భారత విఫణి వీధిలో బఠానీల్లా అమ్ముతున్న మాత్ర. టెలివిజన్లలో, వార్తా పత్రికల్లో భారీ ప్రచారంతో యుక్త వయస్సు పిల్లల్లో అనారోగ్య ఆలోచనలను సృష్టిస్తున్న మాత్ర.
ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా స్త్రీ పురుషులు శృంగారం చేసుకున్నా ఫర్వాలేదని, కలయిక జరిగిన 72 గంటలలోగా ఈ మాత్ర వేసుకుంటే గర్భం రాదని ఊదరగొడుతూ భారత మార్కెట్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ మాత్రను వైద్యుల సిఫార్సు చీటీ లేకుండానే తలనొప్పి మాత్రల్లా అమ్ముకోవచ్చని సోమవారం సమావేశమైన ఔషధ నియంత్రణ సలహా మండలి నిర్ణయం తీసుకుంది. భ్రూణహత్యకు ఉపయోగించే ఈ మాత్రను యధేచ్ఛగా విక్రయించుకునేందుకు ఎందుకు అనుమతి ఇవ్వవలసి వచ్చిందో మండలి సహేతుకమైన కారణాలను మాత్రం వివరించలేదు. కనీసం జనాభా నియంత్రణకు ఇదో మార్గమనే సమర్ధన కూడా చేసుకోలేదు. ఈ మాత్ర వినియోగం వలన యువతుల్లో హర్మొన్ల సమతుల్యం దెబ్బతింటుందని నిపుణులు గగ్గోలు పెడుతున్నా, వైద్యుల సిఫార్సు మేరకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా మండలి పట్టించుకోలేదు.
ఈ నిర్ణయంతో వీటిని తయారు చేస్తున్న ప్రముఖ ఔషధ తయారీ కంపెనీలు సిప్లా, మేన్ కైండ్ ఫార్మాలు మాత్రం చాలా సంతోషంగా కనిపించాయి. మండలి నిర్ణయం పై వ్యాఖ్యానించాడానికి ఆ కంపెనీల ప్రతినిధులు తిరస్కరించారు. అంతేకాదు ఈ మాత్ర అమ్మకాలను గురించి కూడా తెలియచేయడానికి నిరాకరించారు. ప్రస్తుతం మార్కెట్ లో ఈ మాత్రల అమ్మకాలు ఊహించని స్థాయిలో ఉన్నాయన్నది మాత్రం స్పష్టం. న్యూఢిల్లీలోని రెలిగేర్ వెల్ నెస్ స్టోర్స్ మేనేజర్ గురుశరణ్ ఈ విషయాన్ని దృవీకరిస్తూ తమ స్టోర్స్ లో ప్రతీ రోజూ 45 మాత్రలు అమ్మడవుతున్నట్లు వెల్లడించారు. యువతలో ఈ మాత్రలు మంచి ఆదరణకు నోచుకున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన జరిగిన మండలి సమావేశంలో ఈ మాత్రలను దుకాణాల్లో యధేచ్ఛగా విక్రయించే ఔషధంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
Pages: 1 -2- News Posted: 10 November, 2009
|