పెచ్చరిల్లుతున్న మరణవాంఛ న్యూఢిల్లీ : అనారోగ్యం, ఆర్ధిక సమస్యలు, అక్రమ సంబంధాలు, అవమానాలు, వేధింపులు, దైనందిన బతుకులోవత్తిడి ఆధునిక సమాజంలో మనిషి జీవితంపై విరక్తిని పెంచుతున్నాయి. ఆత్మహత్యలే వీటికి పరిష్కారం అన్న భావన పెరిగిపోతోంది. మనిషిలో బలవన్మరణ కోరికను పెంచుతోంది. ఇలాంటి వారు మరణమే శరణ్యమని భావిస్తున్నారు. భారతదేశంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, గడచిన పది సంవత్సరాలలో ఆత్మహత్యలు 28 శాతం మేర పెరిగాయి. జాతీయ క్రైమ్ రికార్డుల మండలి (ఎన్ సిఆర్ బి) సమాచారం ప్రకారం, 1997లో 95,829 మంది వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఖ్య 2007 నాటికి 1,22,637కు పెరిగింది. ఆత్మహత్యను ఒక వ్యక్తికి సంబంధించిన సమస్యగా కన్నా సామాజిక సమస్యగానే ఇప్పుడు ఎక్కువగా పరిగణిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ఆత్మహత్యలు అధిక సంఖ్యలో నమోదైన రాష్ట్రాలలో మహారాష్ట్రది అగ్ర స్థానమని, ఆతరువాత స్థానాలలో పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక ఉన్నాయని ఎన్ సిఆర్ బి తెలియజేసింది. 2005-07 కాలంలో దేశంలో నమోదైన మొత్తం ఆత్మహత్యలలో పది శాతం, అంతకు మించి ఒక్క మహారాష్ట్రలోనే సంభవించాయని ఈ మండలి తెలిపింది.
2007లో పుదుచ్చేరిలో అత్యధిక రేటులో (లక్ష మందికి 48.6 శాతం మేర) ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఆతరువాతి స్థానం అండమాన్ నికోబార్ దీవులది (38.5శాతం). అఖిల భారత స్థాయిలో ఈ రేటు 2006లో 10.5 శాతం ఉండగా 2007లో 10.8 శాతానికి పెరిగింది. ఆత్మహత్యలకు రెండు ప్రధాన కారణాలు కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు. 2005 - 07 కాలంలో నమోదైన ఆత్మహత్యలలో ఇవి 22 శాతం పైగా ఉన్నాయి. 35 శాతం కేసులలో జనం విషం తాగారు . 32 శాతం మంది ఉరి వేసుకున్నారు.
ఆగ్నేయాసియాలో ఆత్మహత్యలను ప్రధాన ప్రజారోగ్య సమస్యగానే భావిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ) తెలియజేసింది. 'గడచిన మూడు దశాబ్దాలలో చేసిన పరిశోధన, మీడియా వార్తలు, సాక్ష్యాధారాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలు ఒక అంటువ్యాధిగా పరిణమిస్తున్నాయి' అని హూ పేర్కొన్నది. ఆత్మహత్యలు చేసుకునేవారు అలా చేస్తున్నట్లు ముందుగా సూచనలు ఇస్తుంటారని హూ తెలిపింది. ఇండియాలో ఈవిధంగా మరణించినవారిలో పది నుంచి ఇరవై శాతం వరకు ఆత్మహత్యకు పాల్పడానికి కొన్ని రోజుల ముందు వైద్యుల వద్దకు వెళ్ళినట్లు తేలింది.
Pages: 1 -2- News Posted: 10 November, 2009
|