దుబాయ్ నీరో మక్తూమ్
లండన్ : రోమ్ తగలపడిపోతుంటే నీరో ఫిడేలు వాయించుకుంటూ కూర్చన్నాడట... మరి దుబాయ్ కింగ్ తక్కువ ఎందుకు తినాలి. అప్పులోళ్ల నెత్తిన చెయ్యెట్టిన దుబాయ్ వరల్డ్ సంక్షోభం మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ఛిద్రం చేసి పారేస్తుంటే ఆయన పందెం గుర్రాలను కొనుక్కుంటూ ఖుషీగానే ఉన్నాడు. అంటే చక్రవర్తి నీరో వెళ్ళి బకెట్ తో మంటలపై నీళ్ళుపోయాలనా మీ ఉద్దేశం, దుబాయి పాలకుడు అడ్డంగా కూర్చుని కూలిపోతున్న ఆర్ధిక సౌధాన్ని ఒంటి చేత్తో ఆపాలని అనుకుంటున్నారా అని వితండవాదం చేసేవాళ్ళకు సమాధానం చెప్పడం కష్టమే.
ప్రభుత్వ రంగ సంస్థ 'దుబాయి వరల్డ్' సంక్షోభాన్ని బయటపెట్టిన రెండు రోజుల తరువాత నవంబర్ 27న ఇంగ్లండ్ న్యూ మార్కెట్ లో టాట్టర్ సాల్స్ అమ్మకాలలో అత్యధిక మొత్తాలు చెల్లించిన కొనుగోలుదారుడు దేశ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్. దుబాయి సంస్థ బాకీలు తీర్చలేకపోవచ్చుననే ఆందోళనతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ లు పతనం కాగా షేక్ కోసం ఆయన సలహాదారులు 1.95 మిలియన్ డాలర్ల మొత్తానికి ఎనిమిది గుర్రం పిల్లలను కొనుగోలు చేశారు. 'ఇన్విన్సిబుల్ స్పిరిట్' అశ్వానికి పుట్టిన కోల్ట్ వాటిలో ఎక్కువ ఖరీదైనది. దీని ధర 2,60,000 గినీలు.
గుర్రాల వ్యాపారం షేక్ మహమ్మద్ వ్యక్తిగత సరదాలలో భాగమని, అందువల్ల ప్రభుత్వంతో గాని, ప్రభుత్వ నిధులతో గాని, ఆర్థిక పునర్వవ్యస్థీకరణతో గాని దీనికి సంబంధం లేదని ఆయన ప్రధాన గుర్రాల విభాగం సలహాదారుడు, కొనుగోలుదారుడు జాన్ ఫెర్గూసన్ సోమవారం యూరప్ లోని అత్యంత పెద్ద గుర్రం వేలంపాట సంస్థ వద్ద ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. న్యూమార్కెట్ లో డిసెంబర్ అమ్మకాలలో ఈ సంవత్సరం షేక్ పెట్టిన ఖర్చు నిరుటి స్థాయిలోనే ఉందని ఫెర్గూసన్ చెప్పారు. గుర్రాల నాణ్యతపైనే అది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఏడాది పిల్లలకు ధరను ఇంగ్లీష్ గినీలలో పేర్కొంటుంటారు. ఒక ఇంగ్లీష్ గినీ ఒక పౌండ్, ఐదు పెన్స్ లతో సమానం. ప్రస్తుతం వాడకంలో లేని గినీ కళాకారులకు, ప్రొఫెషనల్స్ కు చెల్లింపులకు తరచు ఉపయోగించే కరెన్సీ కొలమానం.
Pages: 1 -2- News Posted: 3 December, 2009
|