తల్లి కావాలనుకుని...? న్యూఢిల్లీ : ఆ యువతి తల్లిని కావాలని ఆకాంక్షించింది. అందుకు ఎంతైనా తెగించాలనుకున్న ఆమె, చివరకు పిల్లలను ఎత్తుకుపోయే దొంగగాను, ఆతరువాత హంతకురాలు గాను మారిపోయింది. ఆరుగురు పసికందులను ఎత్తుకుపోయినందుకు, వారిలో కనీసం ఒకరిని హతమార్చినందుకు ఢిల్లీ వాసి రీతూ కపూర్ ను సోమవారం అరెస్టు చేశారు.
గతంలో మహారాష్ట్ర నాసిక్ లో ఇద్దరు అక్కచెల్లెళ్ళు కనీసం తొమ్మిది మంది పిల్లలను ఎత్తుకుపోయి చంపిన దారుణాన్ని ఈ ఉదంతం గుర్తు చేస్తున్నది. నాసిక్ కు చెందిన గవిత్ అక్కచెల్లెళ్ళు తాము అపహరించిన పిల్లలకు శిక్షణ ఇచ్చి జేబుదొంగలుగా మార్చారు. వారిద్దరికీ సుప్రీం కోర్టు 2006లో మరణశిక్ష విధించింది.
కాని రీతూ కపూర్ తల్లిని కావాలనే తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ఈ కిడ్నాప్ లకు ఒడిగట్టిందని పోలీసులు తెలియజేశారు. అయితే, గవిత్ సోదరీమణుల వలె కాకుండా రీతూ కపూర్ తనకు నచ్చని పిల్లలను వదిలించుకున్నది. ఆమె బారిని పడిన పిల్లలలో ఒక రెండు నెలల శిశువు దారుణ హత్యకు గురైంది. 26 సంవత్సరాల రీతూ కపూర్ చదువుకున్న కాలేజీకి సమీపంలోనే గల ఒక వీథిలో ఒక సంచీలో ఆ శిశువు శవం కనిపించింది. 'అనారోగ్యం బారిన పడిన పిల్లలనందరినీ తాను వదిలించుకుని తరువాత ఆరోగ్యంగా ఉన్న శిశువు కోసం అన్వేషిస్తుంటానని ఆమె వెల్లడించింది' అని డిసిపి (వెస్ట్) శరద్ అగర్వాల్ చెప్పారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, పెళ్ళయి నాలుగు సంవత్సరాలు గడచిన తరువాత కూడా గర్భం ధరించలేకపోయిన రీతూను గొడ్రాలని ఆమె అత్తింటివారు నిందించారు. బయటకు గెంటేశారు. భర్త కూడా 2008 లో ఆమెను వదలివేసాడు. తరువాత 2009 ప్రారంభంలో ఒక శిశువును కిడ్నాప్ చేసిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రీతూ కపూర్ ఒక టీ స్టాల్ లో నుంచి మూడు నెలల శిశువును కిడ్నాప్ చేసింది. పునీత్ అని ఆమె నామకరణం చేసిన ఆ శిశువును తాము రక్షించినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.
Pages: 1 -2- News Posted: 8 December, 2009
|