దత్తత మరింత తేలిక న్యూఢిల్లీ : మహిళలు వివాహితులా, అవివాహితులా అనే అంశంతో నిమిత్తం లేకుండా పిల్లల సంరక్షణ బాధ్యత వహించేందుకు, దత్తత స్వీకరించేందుకు అధికారం కల్పించాలని కేంద్రం యోచిస్తున్నది. ఇందు కోసం 1890 నాటి సంరక్షకులు, పిల్లల చట్టం (జిఎడబ్ల్యుఎ - గవా)కు, 1956 నాటి హిందూ దత్తత పోషణ చట్టం (హెచ్ఎఎంఎ - హామా)కు తీసుకురావలసిన సవరణలను కేంద్ర మంత్రివర్గం పరిశీలించనున్నది.
ప్రస్తుతం దంపతులు బాలుడిని లేదా బాలికను దత్తత తీసుకుంటే భర్తే సంరక్షకుడు (గార్డియన్) అవుతున్నాడు. ప్రతిపాదిత సవరణల వల్ల గార్డియన్ లింగ ప్రతిపత్తిని తటస్థం చేయనున్నారు. దీని వల్ల లాంఛనంగా విడాకులు తీసుకోకపోయినప్పటికీ తమ జీవిత భాగస్వామి నుంచి వేరుగా జీవిస్తున్న పురుషులు లేదా మహిళలు దత్తత స్వీకరించడం తేలిక అవుతుంది. అయితే, దత్తత స్వీకారానికి జీవిత భాగస్వామి అంగీకారం తప్పనిసరి అవుతుంది.
కేంద్ర దత్తత వనరుల సంస్థ (సిఎఆర్ఎ - కారా) సమాచారం ప్రకారం, ప్రస్తుతం దత్తత కోసం ఆరు వేల మంది పిల్లలు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు అంటున్నారు. వారికి తోడుగా ఇంకా లెక్కలోకి రాని వీథుల్లో నివసించే పిల్లలు, తల్లిదండ్రులు వదలివేసిన లేదా పారిపోయి వచ్చిన పిల్లలు, వలస వచ్చిన కార్మికుల పిల్లలు, వ్యభిచారుల పిల్లలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఈ పిల్లలకు పోషణ అవసరమని ప్రభుత్వం గుర్తించినప్పటికీ ఆ దిశలో తీసుకున్న చర్యలు పూజ్యం.
Pages: 1 -2- News Posted: 16 December, 2009
|