పిల్లల ఎక్సేంజ్ ఆఫర్! చెన్నై : అప్పుడే పుట్టిన తమ పిల్లలను పరస్పరం మార్చుకోవాలని ఆ తల్లులు పథకం వేశారు. కాని దొరికిపోయారు. ఈ సంఘటన ఎగ్మూరు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి చోటు చేసుకుంది. వీరిలో ఒకరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె మగశిశువును కోరుకున్నది. కాని మళ్ళీ ఆడశిశువుకు జన్మనిచ్చింది. మరొక మహిళ ఇప్పటికే ఒక కుమారునికి తల్లి. ఆమె ఆడశిశువును కోరుకున్నది. కాని తిరిగి మగశిశువునే ప్రసవించింది. కొత్తగా పుట్టిన తమ శిశువులను పరస్పరం మార్చుకోవాలని వారిద్దరూ ఒప్పందానికి వచ్చారు. అయితే, మగశిశువుతో ఒక మహిళ ఆసుపత్రిలో నుంచి వెళ్ళిపోతుండగా ఒక అంబులెన్స్ డ్రైవర్ నిలువరించాడు. పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నించిన మీదట ఆ మహిళలు ఇద్దరూ తమ పథకం సంగతి వెల్లడించారు.
చెన్నై అలండూర్ వాసి అయిన ఎస్. తంగం (34) శుక్రవారం ఉదయం 7 గంటలకు ఒక మగశిశువుతో ఆసుపత్రిలో నుంచి హడావుడిగా వెళ్ళిపోతుండగా అంబులెన్స్ డ్రైవర్ ముత్తళగన్ అనుమానంతో ఆమెను ఆపివేసి, డ్యూటీ నర్సును అప్రమత్తం చేశాడు. తన డిశ్చార్జి వివరాలు ఉన్న నిష్క్రమణ పాస్ కోసం అడిగినప్పుడు తంగం సమాధానం కోసం తడుముకున్నది. అదే సమయంలో పోస్ట్-ఆపరేటివ్ వార్డ్ లో మరొక మహిళ తనకు పుట్టిన మగశిశువు కనిపించడం లేదని కేక పెట్టడం సిబ్బందికి వినిపించింది.
తంగంను పోలీసులకు అప్పగించారు. కొత్త మగ శిశువుకు తల్లి అయిన తిరువళ్ళూరు వాసి బి. అమ్ము (30)ని కూడా పోలీసులు పిలిపించారు. పోలీసులు ప్రశ్నించిన మీదట పరస్పర అంగీకారంతోనే శిశువుల మార్పిడి జరిగినట్లు, ఆసుపత్రి అధికారులు తమ పథకాన్ని పసిగట్టారని తెలుసుకున్నతరువాత తనపై నెపం పడకుండా తప్పించుకోవడానికి శిశువు కనిపించడం లేదంటూ కేకలు పెట్టినట్లు అమ్ము ఒప్పుకున్నది.
Pages: 1 -2- News Posted: 25 December, 2009
|