'ఆత్మహత్య' కట్టుకథలు హైదరాబాద్ : పంతొమ్మిది సంవత్సరాల నీలిమ క్రితం బుధవారం హైదరాబాద్ అంబర్ పేటలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నది. రామంతాపూర్ లో నివసించే గృహిణి ప్రభావతి పదిహేను రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నది. 45 సంవత్సరాల టీచర్ కె. పద్మిని నవంబర్ 24న ఘట్కేసర్ వద్ద రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఆత్మహత్య కేసులన్నిటికీ 'దుర్భరమైన కడుపు నొప్పి' కారణం కావడం విచిత్రం. 'కడుపు నొప్పి ఆత్మహత్య' కేసుల సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికం. ప్రతి నెల పది మందికి పైగా మహిళలు ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాటిలో 95 శాతం వాస్తవాన్ని మరుగుపరచి కడుపు నొప్పిని కారణంగా పేర్కొంటున్నవేనని నగర పోలీసులు అంగీకరిస్తున్నారు.
కాగా, ఈ కేసులలో చాలా వాటికి భర్త, అత్తింటివారి వేధింపులు అసలు కారణమని నగరంలోని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. 'ఇంతకుముందు అనేక మంది వివాహిత మహిళలు వంటగదిలో 'స్టవ్ మంటల' కారణంగా ప్రాణాలు కోల్పోతుండేవారు. కాని ఇప్పుడు 'స్టవ్ మంటలు' అంటే గృహ హింసేనని పోలీసులు గ్రహిస్తున్నందున కడుపు నొప్పి తాజా సాకు అవుతున్నది. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూసుకోవడానికి భర్త లేదా అత్తింటివారు 'దుర్భరమైన కడుపు నొప్పి'తో ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెబుతున్నారు. చాలా కేసులలో పోలీసులు మెట్టినింటివారితో కుమ్మక్కు అవుతున్నారు' అని ప్రగతిశీల మహిళా సంఘం (పిడబ్ల్యుఒ) నాయకురాలు సంధ్య పేర్కొన్నారు.
ఈ కేసులు పెరిగిపోతుండడంతో కలవరపడుతున్న నగరంలోని గైనకాలజిస్టులు 'ఏవిధమైన కడుపు నొప్పి కూడా' ఆత్మహత్యకు పురికొల్పదని చెబుతున్నారు. 'ఈ కేసులలో ఐదు శాతం మాత్రమే సిసలైనవిగా తేలింది. కడుపు నొప్పి బయటకు కనిపించదు కనుక ఆత్మహత్యకు ఇది సురక్షిత కారణంగా పరిగణిస్తున్నారు. నిజానికి ఎటువంటి కడుపు నొప్పి కూడా చికిత్సకు అసాధ్యమైనది కాదు' అని కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ డి. పుష్పలత పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 28 December, 2009
|