పిల్ల పోయి జైలు వచ్చే.. న్యూఢిల్లీ : ప్రియురాలికి కొత్త సంవత్సం మజాను మకావ్ దీవుల్లో అనుభవించాలనుకున్నాడు...దానికి డబ్బు కావాలి కదా... అందుకు ఆ ప్రబుద్ధుడు కన్నతండ్రికే కన్నం వేశాడు. కానీ కల చెదరి, కథ మారి కటకటాల పాలయ్యాడు. అదెలా జరిగిందంటే ఈ కుమార రత్నం తనకు తానే కిడ్నాప్ డ్రామా ఆడాడు. తండ్రి నుంచి ఇరవై లక్షల రూపాయలు నొక్కేశాడు. పానకంలో పుడకలాగ పోలీసులు వచ్చి ప్లానంతా ప్లాపు చేసిపెట్టారు. పవన్ వర్మ అనే ఆ యువకుని కల నెరవేరలేదు. అతని ప్రేయసి సాహచర్యం కూడా లభించలేదు. కాని 22 ఏళ్ళ పవన్ తీహార్ జైలులో ఇతర విచారణ ఖైదీలతో పాటు 2010 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాడు.
'తన స్నేహితురాలి కోర్కె తీర్చడానికి పవన్ ఇప్పటికే రూ. 8.5 లక్షల మేరకు అప్పు చేశాడు. కాని అతనికి ఇంకా చాలా మొత్తం కావాలి. అతను ఒక స్నేహితునితో కలసి తన కిడ్నాప్ కు వ్యూహం పన్నాడు. వారిద్దరినీ అరెస్టు చేశాం' అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ (సెంట్రల్) జస్పాల్ సింగ్ తెలియజేశారు. సంపన్నులు విలాసంగా కాలం గడపడానికి అత్యంత అనువైన హాంకాంగ్ సమీపంలోని మకావ్ కు వెళ్ళాలన్న తొందరలో ఉన్న ఆ యువకుడు అంతే హడావుడిగా పథకం పన్ని తడబడి చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
డిసెంబర్ 26న తన కుమారుడు పావుగంటలో తిరిగి వస్తానంటూ మధ్య ఢిల్లీ కరోల్ బాగ్ లోని తమ కుటుంబ కళ్ళజోళ్ళ షాపులో నుంచి నిష్క్రమించిన కొన్ని గంటల తరువాత రూ. 20 లక్షలు చెల్లించవలసిందని తనను కోరుతూ తన మొబైల్ లో ఒక కాల్ వచ్చిందని పవన్ తండ్రి రామ్ సహాయ్ వర్మ పోలీసులకు తెలియజేశారు. 'కాని అతను (పవన్) ఎంతకూ తిరిగి రాలేదు. నేను అతని మొబైల్ కు ఫోన్ చేసినప్పుడు ఎవరో వ్యక్తి మాట్లాడి, పవన్ ను కిడ్నాప్ చేశారని చెప్పాడు. పవన్ అటువంటి ఎత్తులు వేస్తాడని నేను ఎన్నడూ ఊహించలేదు' అని వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 29 December, 2009
|