గుర్గాఁవ్ : హర్యానా గుర్గాఁవ్ సమీపంలోని తాజ్ నగర్ గ్రామ వాసులు పాతికేళ్లుగా తమ గ్రామంలో రైల్వే స్టేషన్ ఏర్పాటును కోరుతూ వచ్చారు. తమ విన్నపాలను ఎవరూ చెవికెక్కించుకోకపోయేసరికి ఇక లాభం లేదని వారే స్టేషన్ నిర్మాణానికి పూనుకున్నారు. 21 లక్షల రూపాయలను ఖర్చు చేసి వారే సొంతంగా ఒక రైల్వే స్టేషన్ ను నిర్మించుకున్నారు. రైల్వే శాఖ ఒక్క నయాపైస కూడా ఖర్చు పెట్టకుండానే పూర్తయిన తొలి రైల్వే స్టేషన్ దేశంలో బహుశా ఇదే కావచ్చు. వారి కృషి ఫలితమైన ఈ స్టేషన్ మంగళవారం నుంచి పని చేస్తున్నది.
'స్టేషన్ పని చేస్తున్నదని అందరికీ ప్రచారం చేయడం కోసం మేము ఒక వాహనాన్ని అద్దెకు తీసుకువచ్చాం. ఇది మాకు పర్వదినంతో సమానం. మేము స్టేషన్ లో పూజ జరుపుతున్నాం. ప్రయాణికులందరికీ ప్రసాదం అందుతుంది' అని ఆనందం పట్టలేకపోతున్న ఒక గ్రామస్థుడు చెప్పాడు. ఇతర గ్రామాల వారికి కూడా ఈ స్టేషన్ ఉపయోగపడగలదని అతను చెప్పాడు.
తమ కోసం ఒక స్టేషన్ ను నిర్మించడానకి రైల్వే శాఖ అశక్తత ప్రకటించినందున దీనిని తామే నిర్మించుకోవాలంటూ పంచాయతీ దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఒక తీర్మానం ఆమోదించింది. సొంత నిధులతో ఈ నిర్మాణం సాగించాలని గ్రామస్థులు తీర్మానించుకున్నారు. కొద్దిరోజుల్లోనే 11 మంది సభ్యులతో 'గ్రామ సేవా సమితి' ఒకదానిని ఏర్పాటు చేశారు. అది గ్రామస్థుల దగ్గర నుంచి నిధులు వసూలు చేయనారంభించింది.
'గ్రామంలో నివసిస్తున్న 3000 మందికి పైగా ప్రజలలో అధిక సంఖ్యాకులు వ్యవసాయదారులు. కాని గ్రామానికి ఒక రైల్వే స్టేషన్ ఉండాలనే కాంక్ష బలంగా ఉండడంతో ప్రతి ఒక్కరూ తమ తాహతును బట్టి విరాళాలు అందజేశారు. స్టేషన్ కోసం రూ. 3000 నుంచి రూ. 75 వేల వరకు వారు విరాళాలు అందజేశారు. 2008 జనవరిలో మేము స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించాం' అని గ్రామ మాజీ సర్పంచ్ రంజీత్ సింగ్ తెలియజేశారు.