స్మోకింగ్ మానితే షుగర్? న్యూఢిల్లీ : ధూమపానానికి స్వస్తి చెప్పినవారు మధుమేహ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని, ఈ అలవాటు మానివేసిన వారు బరువు పెరగడమే ఇందుకు కారణమని తాజా అధ్యయనం సూచిస్తున్నది. సిగరెట్లు తాగడం మానివేసిన తరువాత జనం బరువు పెరగడానికి, మధుమేహానికి సంబంధం ఉందని జాన్ హాప్కిన్స్ పరిశోధకులు అనుమానిస్తున్నారు. అయితే, ధూమపానం కొనసాగించడానికి ఈ అధ్యయనం ఫలితాలను ఒక సాకుగా తీసుకోరాదని వారు హెచ్చరిస్తున్నారు. ధూమపానం వల్ల శ్వాసకోశ వ్యాధులు, గుండె రోగం, పక్షవాతం, పలు రకాల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని వారంటున్నారు. ఈ అధ్యయనం ఫలితాలను 'ఏన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' ప త్రిక జనవరి 5 తేదీ సంచికలో ప్రచురించారు.
'ధూమపానానికి నాంది పలకవద్దనేదే ప్రధాన సందేశం' అని ఈ అధ్యయన బృందం నాయకురాలు, జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో జనరల్ ఇంటర్నల్ మెడిసిన్, ఎపిడెమియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హిసిన్ చీహ్ 'జెస్సికా' పేర్కొన్నారు. 'ఎవరైనా ధూమపానం చేస్తుంటే దానికి స్వస్తి చెప్పాలి. అదే సరైన మార్గం. అయితే, అలా మానివేసిన వారు తమ బరువుపై ఒక కన్ను వేసి ఉంచాలి కూడా' అని ఆమె సలహా ఇచ్చారు.
Pages: 1 -2- News Posted: 5 January, 2010
|