పెళ్ళికూతుళ్ళదే హవా!
చెన్నై : జమానా బదల్ గయా! దోస్ డేస్ ఆర్ గాన్ ... ఆ రోజులు పోయాయి. ఆడపిల్లంటే గుండెల మీద కుంపటి ఒకప్పటి మాట. వాడికేం రా... మగ మహారాజు అని నీలిగి కూర్చుంటే ఈ రోజుల్లో వాడు కల్యాణయోగం కోసం తపస్సు చేయాల్సిందే. కన్నెచెర వీడటం కష్టం కాదు. బ్రహ్మచారికి మోక్షం లభించడమే ఇప్పుడు గగనం. పెళ్లికెదిగిన కూతుళ్లు ఉన్న తల్లిదండ్రులు భయం భయంగా గడిపేవారు. 'ఆడపిల్లలకు పెళ్లి చేయడం' లేదా 'వధువుకు తగిన వరుని చూడడం' పెద్ద బాధ్యతగా అప్పట్లో భావించేవారు. ఇది చాలా సినిమాలకు ప్రధాన ఇతివృత్తం కూడా అయింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తున్నది.
పెళ్లి సంబంధాల (మాట్రిమోనియల్) వెబ్ సైట్లు, కేంద్రాలను గమనిస్తే ప్రస్తుతం వధువులు దొరకడమే కష్టమనేది తేటతెల్లం అవుతోంది. మాట్రిమోనియల్ కేంద్రాలలో వధువుల కోసం నిరీక్షిస్తున్న వరుల జాబితా చేంతాడంత ఉంటున్నది. వధువుల విషయంలో ఇటువంటి పరిస్థితి లేదు.
'ఇది మంచిదే. కదా?' అని భారత్ మాట్రిమోనిడాట్ కామ్ వ్యవస్థాపక సిఇఒ మురుగవేల్ జానకీరామన్ అన్నారు. 'మారుతున్న మహిళల సామాజిక, ఆర్థిక హోదాను ఇది ప్రతిబింబిస్తున్నది. ఇరవై సంవత్సరాల క్రితం పెళ్లిలో తల్లిదండ్రుల మాటే చెల్లేది. కాని ఇప్పుడు అమ్మాయిలు తమ హక్కులు ఉపయోగించుకుంటున్నారు. ఇష్టం లేకపోతే పెళ్ళి చేసుకునేది లేదని అమ్మాయిలు చెప్పేస్తున్నారని జానకీరామన్ పేర్కొన్నారు. ఇప్పుడు యువతులు బాగా చదువు కుంటున్నారు, పని చేస్తున్నారు, ఆర్జిస్తున్నారు, జీవితంపై సమగ్రమైన అవగాహన కలిగి ఉంటున్నారు. కుమార్తెలపై తమ నిర్ణయాలను రుద్దడం సమంజసం కాదని ఈ కాలం తల్లిదండ్రులు కూడా గ్రహిస్తున్నారు.
అయితే, ఆ యువతులు తమ తల్లిదండ్రులను తమ పెళ్ళి వ్యవహారం నుంచి తప్పించాలనుకోవడం లేదు. పెళ్ళయ్యాకా కూడా తమ జంట తమ తల్లిదండ్రుల వద్దే ఉండాలని యువతులు కోరుకుంటున్నారు. అత్తమామలతో కలిసి ఉండటానికి అమ్మాయిలు అంతగా సుముఖత చూపించడం లేదు. 'తమ భర్తలు నివసించే నగరాలకు తరలిపోవడానికి యువతులు నిరాకరిస్తున్నారు. తమ కుటుంబాలను లేదా కెరీర్ లను వదలుకోవడానికి వారు సిద్ధపడటం లేదు. యువతులలో అనేక మంది తనను చేసుకున్న భర్తను ఇప్పుటి ఉద్యోగాన్ని మానివేసి, లేదా ఉద్యోగం మారి తమ సొంత నగరాలకు తరలిరావలసిందిగా కోరుతున్నారు' అని దివ్యధామ్ పడిగళ్ సంస్థకు చెందిన రుక్మిణీ శ్రీరామన్ తెలిపారు. జాతకచక్రాలు సరిచూసే ఈ సంస్థ 30 ఏళ్లుగా రంగంలో ఉన్నది.
Pages: 1 -2- News Posted: 27 January, 2010
|