అమ్మో! ఆడాళ్ళ షాపింగ్!! న్యూఢిల్లీ : కనపడిందల్లా కొనేయడంలో అతివలే ఆరితేరిన వారు. దీనిపై బోలెడన్నీ జోకులు కూడా ఉన్నాయి. ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నారట. ఒరే మొన్న మా ఆవిడ్ని స్కూటర్ పై తీసుకెళుతుంటే కంట్లో దుమ్ము పడిందిరా. డాక్టరు దగ్గరికి తీసుకెళితే యాభై రూపాయల ఫీజయింది అని వాపోయాడు. అవునా నువ్వెంత అదృష్టవంతడువురా? నేనూ మా ఆవిడ్ని బైక్ పై తీసుకుని వెళుతుంటే మా ఆవిడ కంట్లో నక్లెస్ పడింది. కొనివ్వడానికి యాభై వేలు వదిలింది అంటూ బావురుమన్నాడట. ఆడవారి షాపింగ్ ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచంలో దాదాపు అన్ని పరిశ్రమలూ ఆడాళ్ళూ! మీకు జోహార్లు అంటున్నాయి. మహిళా మణులే లేకపోతే కంపెనీలు దివాళా తీసి నెత్తి మీద చెంగేసుకుని పోవాల్సిందేనట.
ఎందుకంటే ప్రపంచంలో ఏటా వినియోగదారులు చేసే 18.4 ట్రిలియన్ డాలర్ల వ్యయంలో 65 శాతంపైగా అంటే 12 ట్రిలియన్ డాలర్లు లేదా మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణానికి పదింతల సమానమైన ఖర్చు మహిళల అజమాయిషీలోనే జరుగుతోంది. ఇది వచ్చే ఐదేళ్లలో బాగా పెరగవచ్చునని సెలవిస్తున్నారు. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మహిళల ఆదాయం 13 ట్రిలియన్ డాలర్ల నుంచి 18 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుంది. ఇది చైనా, ఇండియా సంయుక్త ఆర్థిక వ్యవస్థల పరిమాణం కన్నా రెట్టింపునకు పైగా ఉంటుంది. ఇండియాలో కూడా 56.5 కోట్ల మంది మహిళల్లో అత్యధిక సంఖ్యాకులు వజ్రాల నుంచి లాప్ టాప్ ల వరకు, ఆస్తుల నుంచి విదేశీ విహారయాత్రల వరకు ప్రతి ఒక్కదానిపై ఖర్చు చేస్తున్నారు.
స్వయం ఉపాధి కల్పించుకున్న మహిళ, ముప్పై ఏళ్ళ సంగీతా షా తన 18 ఏళ్ల కెరీర్ లో ఇప్పటికే ముంబై శివార్లలో రెండు ఇళ్లు, ఒక కారు, రెండు లక్షల రూపాయలు విలువ చేసే నగలు కొనుగోలు చేశారు. 'నేను పొదుపు చేసే మొత్తం కన్నా ఖర్చు చేసేదే ఎక్కువ. వా భర్త నాకు వజ్రాలు కానుకగా ఇస్తున్నప్పటికీ నేను సొంతంగా నగల దుకాణానికి వెళ్లి నా కోసం మరిన్ని కొంటుంటాను' అని సంగీతా షా తెలియజేశారు. గృహిణిగాను, శివం లాజిస్టిక్స్ సంస్థ డైరెక్టర్ గాను రెండు పాత్రలను ఆమె విజయవంతంగా పోషిస్తున్నారు.
బీమా కన్సల్టెన్సీ సంస్థ మార్ష్ లో వైస్ ప్రెసిడెంట్, ఇండియా బిజినెస్ లీడర్ (ఆరోగ్యం, ప్రయోజనాలు, ప్రాక్టీస్ విభాగం)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 38 ఏళ్ల కాంచన టికె పెర్ఫ్యూమ్ లు, వాచీలు, హ్యాండ్ బ్యాగులపై ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. 'నాకు బ్రాండ్లపై మోజు అధికం' అని టీనేజ్ కుమార్తె ఉన్న కాంచన చెప్పారు. అయితే, ఆమె ముందుగా ప్రాధాన్యం ఇచ్చేది పొదుపు చేయడానికే. ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చే కాంచన 'ఉద్యోగినిగా ఉండడం వల్ల స్వతంత్రంగాను, భావోద్వేగ పరంగాను, ఆర్థికంగాను కూడా పటిష్ఠంగా ఉండేందుకు వీలుంటున్నది' అని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 6 March, 2010
|