ఈ మధ్య కాలంలో 'లివ్ ఇన్ రిలేషన్షిప్' భారతదేశంలో కూడా ఒక కొత్తతరహా జీవనశైలిగా మారిపోయింది.మనం ఏదైనా కారును కొనాలనుకుంటే ముందుగా టెస్ట్ డ్రైవ్ చేస్తాం. ఆ తర్వాత నచ్చితేనే ఆ కారును కొంటాము. డేటింగ్ లేదా లివ్ ఇన్ రిలేషన్ కూడా అలాంటిదే. ఈ భావన విదేశాలలో విస్తృతంగా ఉంది. కాని సాంప్రదాయాలను గౌరవించే మన దేశంలో ఈ పద్ధతి ఓపెన్ గా లేకున్నా...ఆల్రెడీ అభివృద్ధిచెందిన దేశాలలో ఎప్పటినుంచో ఈ పద్ధతి పాటిస్తునే ఉన్నారు. డేటింగ్ అంటే వివాహం కాని యువతీయువకులు ఒకరినొకరు ఇష్టపడ్డప్పుడు...పెళ్లికి ముందు కొంతకాలం ఒకరినొకరు అర్థంచేసుకునేందుకు ఇద్దరూ కలిసివుండే ప్రక్రియ.
ఇద్దరూ ఒక సంవత్సరమో లేదా అంతకుమించిన కాలమో నిర్థుష్ట నియమాలు లేని కాలాన్ని పరిగణనలోకి తీసుకుని కలిసి జీవిస్తారు. వీరికి సమాజంతో పట్టింపులేదు. ఇద్దరూ స్వతంత్ర భావాలు కలవారే...ఇద్దరూ సంపాదనపరులే...కాకపోతే ఒకరినొకరు కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ...ప్రయివేటుగా కాపురం చేస్తారు. ఒక్కో సందర్బంలో పది నుంచి పదిహేను సంవత్సరాలు కూడా పెళ్లిచేసుకోకుండా ఉన్న సందర్భాలు ఉంటాయి. అసలు ఇద్దరు కలసిన మనసులతో కాపురం చేసేటప్పుడు...అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి అన్నది వీరి వాదన. విడిపోయే మనస్తత్వం ఉన్నప్పుడు పెళ్లి చేస్తేనేం...నెల్లాళ్లు...లేక వారంలో కూడా విడిపోయే జంటలను మనం చూడటంలేదా...అంటారు.