'కాంగ్రెస్ మట్టి కరుస్తుంది'
(వేముల సదానందం)
వరంగల్ : తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హన్మకొండ ఎం.పి. బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎపియుడబ్ల్యుజె వరంగల్ విభాగం, వరంగల్ ప్రెస్ క్లబ్ గురువారంనాడు సంయుక్తంగా నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేసిన ఘనత తెరాసదే అన్నారు. తెలంగాణ అంశంపై తెరాస వెనుకబడినట్లుగా వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యాన్ని పొందిన వేదిక పార్లమెంట్ భవనం నుంచి తెలంగాణ అంశాన్ని దేశవ్యాప్తంగా వినిపించేలా చేసింది తామే అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ కనీస ప్రయత్నం కూడా చేయలేదన్నారు. పైపెచ్చు ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు అణచివేసేందుకే ఆ పార్టీ కుట్రలు చేసిందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని తారస్థాయిలోకి తీసుకువెళ్ళడంలో తాము సఫలీకృతం అయ్యామన్నారు. పార్లమెంట్ లో 41 రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా వాటిలో 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లిఖితపూర్వకంగా ప్రణబ్ కమిటీకి లేఖలు పంపించాయన్నారు.
ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నా ఏర్పాటు కాకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆంధ్ర పాలకుల కుటిల యత్నాల మధ్య నలిగిపోతోందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రథమ శత్రులు కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఈసారి మాత్రం తెలంగాణకు అడ్డుగా నిలుస్తున్నది వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే అని ఆరోపించారు.
Pages: 1 -2- News Posted: 19 March, 2009
|