విలాసాలకు వీడ్కోలు
న్యూఢిల్లీ: వీకెండ్ విందులు, విలాసాలతో జల్సాగా గడిపే కార్పొరేట్ రోజులకు కాలం చెల్లింది.నిరుద్యోగ సైన్యం వేగంగా పెరిగిపోతోంది. ఏ కంపెనీ ఎప్పుడు దివాళా తీసి ఉద్యోగుల్ని రోడ్డు మీదకు నెడుతుందో చెప్పలేని అనిశ్చిత పరిస్థితి కొనసాగుతోంది. ఈ గడ్డు పరిస్థితిని, ఐటి బూమ్ లో కార్పొరేట్ జీతాలతో పుట్టుకొచ్చిన కొత్త తరం ఎదుర్కోవడం కొంత కష్టమే. జెట్ ఎయిర్ వేస్ లో ఫ్లయిట్ అటెండెంట్ గా పనిచేస్తున్ననీనా గుప్త ఆకర్షణీయమైన జీతంతో చాలా హాపీగా కాలం గడిపేవారు. 23 ఏళ్ల గుప్త గత మూడేళ్ళగా నెలకు 100 గంటలసేపు ఫ్లైట్లలో విహరించడమే కాదు, ఊహా లోకపు అంచుల్లో కూడా గడిపేవారు. వస్తువ్యామోహంలో విలాసవంతమైన బట్టలు, స్టయిలిష్ బ్యాగులు, షూలను విసుగు లేకుండా తీరిక వేళల్లో షాపింగ్ చేస్తూ ఆనందించేవారు. అయితే గత మూడు వారాలుగా ఆమె తన ఆర్ధిక పరిస్థితి గురించి, విలాసవంతమైన జీవితం గురించి ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుండి ప్రపంచ వ్యాప్తంగా విమానయాన వ్యాపారం బాగా దెబ్బతింది. జెట్ ఎయిర్ వేస్ కూడా మాంద్యం కారణంగా పలు సర్వీసులను రద్దు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించే వార్తలు పదే పదే జెట్ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తించేవి. ఆ పింక్ పేపర్ ఒక రోజు గుప్త తలుపు కూడా తట్టింది.
ఆకర్షణీయమైన జీతంతో హాయిగా సాగుతున్న జీవితం నిప్పుల గుండంలో పడినట్లయ్యింది. ఆధునిక జీవన శైలికి అలవాటు పడిన ప్రాణం ఉద్యోగం కోల్పోవడంతో విలవిల్లాడింది. తన బ్యాంకు బ్యాలెన్స్ మూడు నెలలు గడుపేందుకు మాత్రమే సరిపోతాయి. కాల్ సెంటర్లు, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగాల కోసం అమె ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగం పోయి, ఆ జీతం తెచ్చిన జీవన శైలి మిగలడంతో గుప్త పరిస్థితి దుర్భరంగా మారింది. ఇది గుప్త ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదు ఐటి, ఫైనాన్స్ , ఎగుమతి ఆధారిత రంగాల్లోని మరెందరో ఉద్యోగుల పరిస్థితి దాదాపు దయనీయంగా మారింది.
ఆర్ధిక వికాస కాలంలో ఉద్యోగాలు సంపాదించిన భారత యువజనులు ఆకర్షణీయమైన జీతాలతో విలాసవంతమైన ఆధునిక జీవనశైలికి అలవాటు పడ్డారు. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం భారత యువజనుల జీవితాలను కుదిపేస్తోంది. వారి వద్ద పరిష్కారాలు కూడా లేవు. గత ఏడాది సెప్టెంబర్ నుండి దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యేట్టుంది. స్టాక్ మార్కెట్లలో మారణహోమం కొనసాగడం, అభివృద్ధి రేటు క్షీణించడంతో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పొదుపుగా ఖర్చు చేస్తూ విజయాలను సాధించాలన్నగత తరాల భావన వర్తమాన కాలపు తెలివైన ఆలోచనగా నిలిచింది. అయితే కార్పొరేట్ జీతాలు అలవరచిన కార్పొరేట్ జీవన శైలికి భవిష్యత్ పట్ల బాధ్యతతో గడపడం తెలియదు. వర్తమానంలో అనుభవించడమే సత్యంగా భావిస్తుంది. వస్తు వ్యామోహం, లాపేక్షలే మానవ విలువలుగా బతికేందుకు ప్రేరేపిస్తుంది. అలాంటి జీవనశైలి డబ్బు పుష్కలంగా వస్తున్న సమయంలో బాగానే ఉంటుంది. సంక్షోభం పరిణామాలను ఆ జీవిత దృక్పథం జీర్ణించుకోలేదు. దాంతో ఆయా వ్యక్తులు నిర్వర్యులవుతారు. దిగులుపడి కుంగి పోతారు.
Pages: 1 -2- -3- News Posted: 19 March, 2009
|