కోటి కోరిన స్మోకర్ ముంబై : పదహారేళ్ళ ప్రాయంలో మొదటిసారిగా 'విల్స్ నేవీ కట్' సిగరెట్ ను ముట్టించిన, ఆతరువాత దానికి బానిస అయిన క్యాన్సర్ రోగి, ముగ్గురు పిల్లల తండ్రి ఒకరు పొగతాగడం వల్ల కలిగే 'అపాయాల' గురించి తనను హెచ్చరించనందుకు ఆ సిగరెట్ ఉత్పత్తి సంస్థ 'ఐటిసి'ని వినియోగదారుల కోర్టుకు ఈడ్చారు.
గొంతు క్యాన్సర్ చివరి దశలలో ఉన్న, తన స్వరపేటిక తొలగింపునకు జరిగిన శస్త్రచికిత్స కారణంగా మాట్లాడలేకపోతున్న కస్టమ్స్ అధికారి దీపక్ కుమార్ ఆ సంస్థ నుంచి కోటి రూపాయల నష్టపరిహారాన్ని కోరారు. ముంబైలో అదనపు కస్టమ్స్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న దీపక్ కుమార్ మహారాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ముందు తన ఫిర్యాదును దాఖలు చేశారు.
'ఇప్పుడు ప్రతి సిగరెట్ ప్యాకెట్ పైన చట్టబద్ధమైన హెచ్చరిక ఉంటున్నది... కాని లోగడ ఇటువంటి హెచ్చరిక ఉండేది కాదు. దీని వల్ల కలిగే ముప్పును గుర్తించకుండానే నేను 30 సంవత్సరాల పాటు ధూమపానం చేశాను' అని 59 సంవత్సరాల దీపక్ కుమార్ తెలియజేశారు. 'పొగాకు క్యాన్సర్ కారకమని సూచించే హెచ్చరిక ఏదీ ప్యాకెట్ పై లేదు. ఐటిసి దండిగా డబ్బు చేసుకోగా నేను నాకు తెలియకుండానే మరణం దిశగా సాగిపోతున్నాను. ధూమపానానికి స్వస్తి చెప్పడానికి నేను ఎన్నో సార్లు ప్రయత్నించాను కాని కృతకృత్యుడిని కాలేకపోయాను. నేను ఇప్పుడు న్యాయం కోరుతున్నాను' అని దీపక్ చెప్పారు.
Pages: 1 -2- -3- News Posted: 3 December, 2009
|